ప్రియమైన నీకు...
ప్రియమైన నీకు,

నిన్నటి నీ లేఖ ఇప్పటికి అసంఖ్యాకంగా చదువుకున్నాను..!
 (అందులోని నీ ముద్దులని కూడా...)
లేఖను విప్పగానే నా చుట్టూ ఒక సుమనోహరోద్యానవనం పరుచుకుంటుంది
నీ అక్షరాల పూవులన్నీ నా ఎదపై జారిపడి, ఒళ్ళు జల్లుమనిపించి, గొల్లున నవ్వుతాయి 
ఆ తన్మయత్వంతో నా అరమోడ్పు కన్నులు నీ పదాల అల్లిక వెంట పరుగుతీస్తాయి 
ప్రతి అక్షరంలోనూ కురిసేటి ప్రణయ జల్లులో నా హృది తడిసి ముద్దవుతుంది
ముద్దులొలుకు నీ చేతి రాత చూసి నా మెడలోని ముత్యాల హారం వెలవెలబోతుంది
నీ తేనెల మాటల ఊటలో మనసు మునిగి తేలుతుంది 
కుహూరవేదో నా చెవిలో నీ వేణువూది పోతుంది 

అంతలోనే అంతులేని దిగులేదో వచ్చి కమ్ముకుంటుంది 
నీవు వచ్చే రోజు కోసం నా మనసు అనుదినం ఆరాటపడుతుంది.
నిన్ను చూసే క్షణం కోసం నా కళ్ళు ప్రతి క్షణం కలవరిస్తున్నాయి
కలవరింతల కాలం నాలో కలత రేపి కునుకు రానీయకుంది 
స్వప్నదీపికలు కొడిగట్టి నిన్ను చూపకున్నాయి 
ఎదురుచూపుల ప్రవాహంలో ప్రతిరోజూ ఈదులాడుతాను
ఈ విరహ వేదనింక ఎటులోర్తునని నా ఎద నాకే ఎదురుతిరుగుతోంది

ఉషోదయాన నీ వదనారవిందము తిలకించు భాగ్యమెపుడో కదా..!
తుషారకరుని నిశాలను నీతో కలిసి ఆస్వాదించు పూర్ణిమెపుడో కదా..! 
నీ రాక తెలుపు చిరుగాలుల చలనాల స్పర్శ ఏనాటికో కదా..! 
మన మన్దీపికల వెలుగులో ఇరువురి మరీచికలొకటై
 మంజుల నందనము చేయు నిమిషమెపుడో కదా..!

 మది తృష్ణ తీర్చు చిరుజల్లులు నీ లేఖలు 
 ప్రతీక్ష పూరించు పండు వెన్నెలలు నీ లేఖలు 
కదంబవాయువుల చేత కబురంపుట మరువకుమా.....
నీ ఆలింగనైశ్వర్యములకై నిరీక్షించుచు.....


-ప్రేమతో నేను 

First